Blog Detail
కొవిడ్ తర్వాత ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలో నుంచి చూసే ధోరణి పెరిగింది. వ్యాధితో మరణాలు నమోదు కాగానే, భయంతో బెంబేలుపడిపోయే స్వభావం ఏర్పడిపోయింది. అలాంటి కోవకు చెందినదే తాజా ‘గులియన్ బార్’ సిండ్రోమ్. అందర్నీ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ వ్యాధి గురించి వైద్యులు ఏమంటున్నారంటే...
గులియన్ బార్ సిండ్రోమ్ కొత్తదేమీ కాదు. వందేళ్ల నుంచి మనుగడలో ఉన్న పాత వ్యాధే! సిండ్రోమ్ అంటే లక్షణాల సమాహారం అని అర్థం. కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు బయల్పడతాయి కాబట్టే ఈ రుగ్మతను సిండ్రోమ్‌గా పేర్కొంటున్నారు. గులియన్ బార్ సిండ్రోమ్‌లో ప్రధానంగా నాడీవ్యవస్థ దెబ్బతిని, పక్షవాతాన్ని పోలిన లక్షణాలు కనిపిస్తాయి. అలాగని దీన్ని పక్షవాతంగా పొరపాటు పడకూడదు. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే...
చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, బలహీనత
నడవడం, మెట్లెక్కడంలో ఇబ్బంది
నడక తడబడడం
మింగడంలో ఇబ్బంది
కనురెప్పలు మూయలేకపోవడం
మొదట కాళ్లూ చేతులు పడిపోవచ్చు
నీరసం, నిస్సత్తువ
పక్షవాతం లక్షణాలు శరీరంలో పైనుంచి కిందకూ లేదా కిందనుంచి పైకీ వ్యాపించవచ్చు
శరీర తత్వాన్ని బట్టి తీవ్రం
కూర్చుని లేవడంలో ఇబ్బంది మొదలు వెంటిలేటర్ సపోర్ట్‌కు చేరుకునేవరకూ ఈ వ్యాధిలో ఆరు దశలుంటాయి. ఈ దశల మధ్య సమయ నిడివి కొందర్లో ఎంతో తక్కువగా ఉంటుంది. వ్యాధి తీవ్రరూపం దాల్చడానికి మూడు నుంచి నాలుగు వారాలు పడుతుంది. కానీ కొందర్లో కూర్చుని నిలబడడానికి ఇబ్బందిపడే తొలి దశ, వారం రోజుల్లోనే వెంటిలేటర్‌కు చేరుకునే చివరిదశకు పెరిగిపోతుంది. ప్రధానంగా నాడులను దెబ్బతీసే ఈ వ్యాధి సోకిన ఐదు శాతం మందిలో, అటానమిక్ డిస్టర్బెన్స్ సమస్య తలెత్తుతుంది. అంటే, సాధారణంగా స్పృహలో లేకపోయినా, మన శరీరం రక్తపోటును సక్రమంగా నియంత్రిస్తూనే ఉంటుంది. అయితే గులియన్ బార్ సిండ్రోమ్ వల్ల అటానమిక్ నాడీ వ్యవస్థ దెబ్బతిన్న అతి కొద్ది మందిలో రక్తపోటు నియంత్రణ కోల్పోయి, పరిస్థితి విషమించవచ్చు. అయితే ఇలాంటి స్థితిని అధికమించగలిగితే, ప్రాణాపాయం ఉండదు. 20 ఏళ్ల క్రితం ఇలాంటి నాలుగు, ఐదు, ఆరో దశలకు చేరుకున్న వాళ్లు కోలుకునే అవకాశాలు తక్కువగా ఉండేవి. కానీ నేడు అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకొచ్చాయి కాబట్టి ఆ రోగులు కూడా తిరిగి పూర్తిగా కోలుకోగలుగుతున్నారు.
సమస్య శరీరంలోనే....
ప్రధానంగా ఇది ఆటొఇమ్యూన్ డిజార్డర్. అంటే బయటి కారకాల వల్ల కాకుండా, మన శరీరంలోనే జనించే ఆరోగ్య సమస్య ఇది. వైరల్ జ్వరాలు తగ్గిన తర్వాత కీళ్ల వాతాలు వేధించడం సర్వసాధారణం. అలాగని కీళ్లవాతానికీ వైర్‌సకూ సంబంధం లేదు. వైర్‌సతో పోరాడే శరీర స్పందన ఫలితమే కీళ్ల వాతం. గులియన్ బార్ సిండ్రోమ్ కూడా అలాంటిదే! ఈ రుగ్మతకూ బ్యాక్టీరియాకూ ఎలాంటి సంబంధం లేదు. వ్యాధికారక బ్యాక్టీరియాకూ, మన శరీరంలోని మంచి బ్యాక్టీరియాకూ కొన్ని పోలికలుంటాయి. శరీరంలోని కామన్ బ్యాక్టీరియాను ఉపయోగకరమైన మంచి బ్యాక్టీరియాగా మన వ్యాధినిరోధకవ్యవస్థ గుర్తుపడుతుంది. కానీ వ్యాధికారక బ్యాక్టీరియా, మన శరీరంలోని మంచి బ్యాక్టీరియాల యాంటీజన్లు ఒకే రకమైనవి కావడం వల్ల ‘మాలిక్యులర్ మిమిక్రీ’ పరిస్థితి తలెత్తుతుంది. దాంతో మన శరీరంలోని యాంటీబాడీలు, వ్యాధికారక బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా మీద దాడిని కొనసాగిస్తాయి. ఫలితంగా నాడులు దెబ్బతిని గులియన్ బార్ సిండ్రోమ్ తలెత్తుతుంది.
ఎవరికైనా, ఎప్పుడైనా...
ఈ సిండ్రోమ్‌కు క్యాంపిలోబ్యాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ప్రధాన కారణం. కలుషిత నీటిలో ఉండే ఈ బ్యాక్టీరియా సోకడంతో గులియన్ బార్ సిండ్రోమ్ రుగ్మతకు బీజాలు పడ్డాయి. ఈ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ సోకి, విరోచనాలు వేధించి, కోలుకున్న రెండు నుంచి మూడు వారాల తర్వాత పక్షవాత లక్షణాలు మొదలై, ఈ రుగ్మత వెలుగులోకొచ్చింది. నిజానికి విరోచనాలే కాకుండా జలుబు, దగ్గుతో కూడిన వైరల్ ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత కూడా ఈ సిండ్రోమ్‌కు గురయ్యే అవకాశాలుంటాయి. ఇలా 30 నుంచి 40% మందిలో పూర్వ రుగ్మతలు తగ్గిన తర్వాత గులియన్ బార్ సిండ్రోమ్ తలెత్తవచ్చు. మిగతా 60 నుంచి 70 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు, రుగ్మతలు లేకుండా నేరుగా పక్షవాతంతోనే ఈ సిండ్రోమ్ బయల్పడవచ్చు. తీవ్ర రుగ్మత నుంచి, సర్జరీల నుంచి కోలుకున్న వారిలో కూడా ఆటో ఇమ్యూన్ స్ట్రెస్ తలెత్తి, నాడీ వ్యవస్థ దెబ్బతిని ఈ సిండ్రోమ్ తలెత్తవచ్చు.
సమర్థమైన చికిత్సలున్నాయి
ఈ రుగ్మతను ఎంత త్వరగా నిర్ధారించి, చికిత్సను అందించగలిగితే అంత మెరుగ్గా, వేగంగా కోలుకోగలుగుతారు. వంద మంది గులియన్ బార్ సిండ్రోమ్ రోగుల్లో కేవలం ఒకరిద్దరికి మాత్రమే పెరిఫెరల్ నాడీ వ్యవస్థతో పాటు మెదడు, రక్తపోటు కూడా ప్రభావితమవుతుంది. ఫలితంగా పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది. అయితే రక్తపోటు, మెదడు ప్రభావితం కానంతవరకూ వెంటిలేటర్ స్థితికి చేరుకున్న రోగులను కూడా తిరిగి పూర్తిగా కోలుకోగలిగేలా చేసే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రుగ్మతకు ప్రారంభంలోనే అడ్డుకట్ట వేయాలంటే లక్షణాలను గుర్తించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి. చికిత్సతో రెండు నెలల్లోనే పూర్తిగా కోలుకోవచ్చు. చికిత్సలో భాగంగా యాంటీబాడీ ఇంజెక్షన్, ప్లాస్మా మార్పిడిని వైద్యులు అనుసరిస్తారు. ఈ చికిత్సతో శరీరంలోని యాంటీబాడీలను మార్పిడి చేసి, వ్యాధి తీవ్రతను తగ్గించడం వల్ల రోగి పూర్తిగా కోలుకునే అవకాశాలు పెరుగుతాయి.
గులియన్ బార్ వాస్తవాలు ఇవే!
ఇది కొత్త వ్యాధి కాదు. వందేళ్ల నుంచి మనుగడలో ఉన్నదే!
ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అంటువ్యాధి కానే కాదు
మన వ్యాధినిరోధక వ్యవస్థ మన మీదే దాడి చేసే ఆటొఇమ్యూన్ డిజార్డర్ ఇది
ఎంత త్వరగా లక్షణాలను గుర్తించి వైద్య చికిత్స అందిస్తే, అంతే త్వరగా కోలుకోవచ్చు
వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశాలు తక్కువ
శరీర తత్వం, జన్యు మేక్‌పల మీదే గులియన్ బార్ సిండ్రోమ్ తలెత్తే అవకాశాలు ఆధారపడి ఉంటాయి
ఈ రుగ్మత ఎవరికైనా, ఏ వయసువారికైనా రావచ్చు
వ్యాధి దశ మీదే లక్షణాలు ఆధారపడి ఉంటాయి
Facebook | Instagram | Twitter | Linkedin | Pinterest
01 Reviews
Jockon Dom
10 months agoCupcake ipsum dolor sit amet. Dragée sweet roll tiramisuet croissant lollipop candy.