Blog Detail

నిద్రలేమి పరిచయం
ప్రస్తుత జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిద్రలేమి. ప్రతి మనిషికి ఆహారం, నీరు, గాలి ఎంత ముఖ్యమైనవో నిద్ర కూడా అంతే ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే సగటున ఒక రోజుకూ 6 నుంచి 8 గంటల పాటు నిద్ర అవసరం. ఈ నిద్ర సమయం అనేది ఒక్కొక్క వయస్సు గల వారిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. నిద్రలేకపోతే చికాకు, ఏకాగ్రత కోల్పోవడం వంటి అనేక సమస్యలు వస్తాయి.
నిద్రలేమి సమస్యకు కారణం ఏమైనప్పటికీ, శారీరకంగా మరియు మానసికంగా ప్రభావితం చేస్తుంది. నిద్రలేమి ఉన్న వ్యక్తులు బాగా నిద్రపోయే వ్యక్తులతో పోలిస్తే తక్కువ జీవన నాణ్యతలను కలిగి ఉంటారు. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఈ నిద్రలేమి సమస్య ఆందోళనలను కలిగిస్తుంది.
నిద్రలేమి యొక్క రకాలు
నిద్రలేమి సమస్య అనేక రకాలుగా ఉంటుంది. అయితే అవి సంభవించే కాలం మరియు సమయాన్ని బట్టి మారుతుంటుంది.
- ప్రారంభ నిద్రలేమి: ఒక వ్యక్తి ప్రతి రాత్రి నిద్రపోవడానికి ఇబ్బందిపడడం.
- తాత్కాలిక నిద్రలేమి: ఒక నెల కంటే తక్కువ రోజులు ఉండే నిద్రలేమి పరిస్థితి.
- తీవ్రమైన నిద్రలేమి: దీనినే స్వల్పకాలిక నిద్రలేమి అని కూడా పిలుస్తారు. ఈ సమస్య ఒకటి నుంచి ఆరు నెలల మధ్య వరకు ఉండవచ్చు.
- దీర్ఘకాలిక నిద్రలేమి: మూడు నెలలు లేదా ఏడాది పాటు ఒక వ్యక్తి నిద్రపోవడానికి ఇబ్బంది పడే పరిస్ధితిని దీర్ఘకాలిక నిద్రలేమి అంటారు . ఈ సమస్య అనేక కారణాలు (అందోళన, ఒత్తిడి, నిరాశ) వల్ల రావచ్చు.
ఒక వ్యక్తి అకస్మాత్తుగా నిద్రలో నుంచి మేల్కొన్న తర్వాత మళ్లీ నిద్రపోవడంలో ఇబ్బంది పడడాన్ని మెయింటెనెన్స్ ఇన్సోమ్నిమా (Maintenance insomnia) అంటారు.
నిద్రలేమి లక్షణాలు
- వికారం
- రాత్రివేళ నిద్రపోవడానికి ఇబ్బంది పడడం
- రాత్రి సమయంలో తరచుగా మేల్కొవడం లేదా ఉదయాన్నే త్వరగా లేవడం
- పగటిపూట అలసటకు గురి కావడం
- చిరాకు, నిరాశ లేదా ఆందోళన చెందడం
- పనులపై దృష్టి, శ్రద్ధ పెట్టలేకపోవడం
- జ్ఞాపక శక్తి తగ్గడం మరియు శారీరకంగా చురుకుగా ఉండకపోవడం
- అన్ని వేళలా నీరసంగా అనిపించడం
- చిన్న చిన్న విషయాలకే కోపం, చిరాకు రావడం
- రోజుకు 6 నుంచి 8 గంటలు కంటే తక్కువ పడుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్ధ సమర్ధవంతంగా పనిచేయక అనేక అనారోగ్య సమస్యలు సైతం వచ్చే అవకాశం ఉంటుంది.